చేపల సాగు

చేపల సాగు

ప్రపంచంలోనే పోషణ పదార్ధాలు మెండుగా ఉండే ఆహార పదార్ధాలలో చేపలు చాలా ప్రధానమైనవి. అందుకే వీటి సాగు అన్ని దేశాలలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకోగా ఎంతో మంది వీటి పెంపకం ద్వారా అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా 50% పైగా ప్రజలు చేపను అమితంగా ఇష్టపడే భారతదేశంలో వీటి సాగు ఎంతో విరివిగా చేయబడుతుంది. నీటి వ్యవసాయంలో చేపల సాగు ఒక రకం కాగా ఎక్కువగా సముద్ర జలాల నుండి వీటిని దిగుబడి చేసుకుని అమ్మడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ సాంప్రదాయం కనుమరుగైపోతుండగా ప్రత్యేకంగా ఏర్పరిచిన సరస్సులు లేక చెరువులలో వీటిని సాగు చేయడం జరుగుతోంది. ఇక దిగుబడి విషయానికి వస్తే ప్రపంచ పట్టికలో 60%తో చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

అన్నిటికీ సిద్దపడాలి
 • చేపల సాగు అనేది చాలా సున్నితమైనది మరియు ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నది.
 • సరైన నియమాలను పాటించకుంటే లాభాల సంగతి అటుంచితే పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
 • అయితే అన్నిటికీ ఓర్చి విజయం సాధించినట్లయితే చేపల పెంపకం వలన వచ్చే లాభాలు ఊహకి అందని రీతిలో ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
ఏ ప్రాంతాన్ని ఎన్నుకోవాలి ?
 • చేపల పెంపకంలో ప్రధానమైన అడుగు సరైన ప్రాంతాన్ని ఎన్నుకోవడం. ఇక్కడ కనుక తప్పటడుగు పడితే నష్టాలు ఖాయం. కనుక ఎక్కువగా తీర ప్రాంతాలు, నదీ జలాలకు దగ్గరగా ఉండే ప్రాంతాలు లేక సహజ వనరులతో సమృద్ధిగా ఉండే ప్రాంతాలను చేపల పెంపకానికి ఎన్నుకోవాలి.
 • ఇకపోతే వరదలతో ముంచెత్తే ప్రాంతాలు, కాలుష్యభరితమైన ప్రాంతాలతో పాటు రసాయనిక మందులను ఎక్కువగా వినియోగించే పొలాలు ఉన్న ప్రాంతాలు వీటి పెంపకానికి సరైనవి కావు.
 • ఇక తదుపరి అంకం చేపలను పెంచే స్థావరం. అది చెరువు కావచ్చు, నీటిలో ఉంచే బోను కావచ్చు లేక ప్రత్యేకంగా ఏర్పరుచుకునే ట్యాంక్ కావచ్చు. సాధారణంగా చిన్నకారు రైతులు ట్యాంకులలో మరియు నీటి బోనుల ద్వారా చేపలను సాగు చేస్తుంటారు.
 • అయితే చేపల పెంపకం ద్వారా ఎక్కువ దిగుబడితో పాటు అత్యధిక లాభాలను ఆర్జించాలను భావిస్తే, తప్పకుండా చెరువులలో లేక సరస్సులలో వీటి పెంపకం చేపట్టాలి.
 • చివరగా చేపల సాగుని మరింత లాభదాయకంగా మరియు రవాణాకు అనుకూలంగా మార్చాలన్నా, నగరానికి చేరువలో వీటి సాగు చేపట్టడం మంచిది.
ఎన్నుకోవాల్సిన రకం
 • మార్కెట్లో చేపల సాగుకు సంబంధించి ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. ఎంచుకునే రకంపై రైతుకు వచ్చే లాభాలు ఆధారపడి ఉంటాయి.
 • ప్రాంతాన్ని బట్టి, జనాల అభిరుచిని బట్టి చేపల ఖరీదు మరియు వచ్చే లాభం నిర్ణయించబడుతుంది. కాబట్టి రైతులకు స్థానిక మార్కెట్ గురించి బాగా తెలిసుండాలి. మార్కెట్ డిమాండ్ ఒక రకంపై ఉండి, పెంపకం మరొక రకాన్ని చేపడితే నష్టాలు తప్పవు.
చేపలకు కావలసిన దాణా
 • చేపలు ఆరోగ్యవంతంగా ఎదిగి మంచి లాభాలను తీసుకురావాలంటే వాటికి ఇచ్చే దాణా ఎంతో నాణ్యమైనదిగా ఉండాలి.
 • అందుకే విటమిన్లు, ఖనిజాలు మరియు ఉప్పు ఎక్కువగా ఉండే పౌష్టిక ఆహారం చేపలకు అవసరం. ఈ యొక్క దాణాను నిపుణుల సలహాతో స్వయంగా తయారు చేసుకోవచ్చు లేదంటే బయిట మార్కెట్ నుండి పొందవచ్చు.
 • ఇక చేపలకు ఇచ్చే ఆహార రకం మరియు పరిమాణం అనేది ఎంచుకున్న రకాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా నిపుణులను సంప్రదిస్తే మంచిది.
నిర్వహణ
 • చేపలకు మంచి పౌష్టికాహారాన్ని ఇవ్వడంతో పాటు ఎప్పటికప్పుడు సరస్సులోని నీటిని మార్చుతూ ఉండాలి. అలా కుదరకపోతే నిపుణులను సంప్రదించి సరస్సులో సరైన రసాయనిక మందులను చల్లుకోవడం తప్పనిసరి.
 • చేపల ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించడమే కాకుండా నీటి మరియు నేల నాణ్యతను కూడా పరీక్షిస్తుండాలి.
 • ఇక చివరగా, సరస్సులోకి ఎటువంటి వేటాడే జంతువులు కాని, పాములు మరియు కప్పలు వంటివి ప్రవేశించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
చేపల సేకరణ
 • చేపలు చేతికి రావడం అనేది ఎంచుకునే రకంపై ఆధారపడి ఉంటుంది.
 • వీటిని సేకరించడం కోసం వలయాన్ని వినియోగించవచ్చు లేక సరస్సులోని నీటిని మొత్తం ఎత్తివేసి చేపలను సేకరించవచ్చు.
 • చేప నాణ్యతను కోల్పోకుండా మంచి లాభాలు ఆర్జించాలంటే వెంటనే మార్కెట్కి పంపాలి.
Continue Reading

ఉసిరి సాగు

ఉసిరి సాగు

భారతదేశ ఉన్నత జాతి పండు అయిన ఉసిరి ప్రాచీన కాలం నుండి తన గొప్పతనాన్ని చాటుతూ వస్తోంది. విటమిన్ సి గుణాలు ఎక్కువగా కలిగిన ఈ పండులో ఎన్నో ఆరోగ్య ప్రదాయమైన లక్షణాలు ఉన్నాయి. ఇక ఎన్నో తరాలుగా దీని పచ్చడి భారతదేశ వంటకాలలో ముఖ్యమైనదిగా ఉంటూ వస్తోందంటే దాని రుచి ఎంత ప్రాచుర్యం పొందిందో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఉసిరిని జుట్టు మరియు టూత్ పేస్ట్ ఉత్పత్తులలో వినియోగించడం పరిపాటి. ఎన్నో రకాలలో లభించే ఈ ఉసిరిని ఖచ్చితమైన తరహాలో సాగు చేస్తే అధిక లాభాలను ఇస్తుందని వ్యవసాయ నిపుణులు చెబుతుంటారు. మరి అటువంటి ఉసిరి సాగులో ఉండే అనుకూలాంశాలు, ప్రతికూలాంశాలు ఏమిటో చూద్దాం.

వాతావరణం మరియు నేల రకాలు
 • ఉసిరి సాగు చాలా సున్నితమైన పంట కాగా ఎక్కువగా ఉష్ణమండలాలలో బాగా పెరుగుతుంది. అయితే ఈ పంటకు ఎక్కువ వేడి గాని ఎక్కువ మంచు కాని ఉండకూడదనేది నిపుణుల సూచన.
 • అనుభవజ్ఞుల ప్రకారం వార్షిక వర్షపాతం 650 నుండి 850 మిల్లీమీటర్లు ఉంటే అధిక దిగుబడి లభిస్తుంది. ఇక నాటుకునే సమయంలో 24 నుండి 34 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం.
 • నేల విషయానికి వస్తే, ఉప్ప నేల మరియు ఆమ్ల నేల ఉసిరి పంటకు బాగా అనువుగా ఉంటాయి.
 • అంతేకాకుండా ఉదజని విలువ 6.5 నుండి 9.5 ఉన్న నేల కూడా ఉసిరి సాగుకు అనుకూలంగా ఉంటుంది. అయితే గట్టి నేల మరియు పూర్తి ఇసుక నేల ఈ పంటకు సరిపోవు అని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.
నేలను సిద్దం చేయడం
 • అన్ని పంటల తరహాలోనే ఈ పంటకు కూడా నేలను బాగా దున్నుకుని చక్కగా చదును చేసుకోవాలి. ఈ క్రమంలో గత పంటలోని కలుపు మొక్కలు, వ్యర్ధ పదార్ధాలు నేలలో లేకుండా జాగ్రత్త వహించాలి.
 • ఇక చివరి క్రమంలో తగినంత సహజ ఎరువులను చల్లుకోవడం మరిచిపోవద్దని అనుభవజ్ఞులు సూచిస్తున్నారు.
 • ఆ తరువాత 2.5m లోతులో 15x15m వ్యత్యాసంతో నారు మడులను సిద్ధం చేసుకోవాలి. దీని పిమ్మట ఒక స్క్వేర్ మీటర్ గుంతలను తవ్వుకుని రెండు నుండి మూడు వారాలు సూర్య రష్మికి పెట్టాలి. దీని వలన నేలలో సాంధ్రత పెరుగుతుంది.
నాటుకునే ప్రక్రియ
 • ఉసిరి పంటను మొలకలను రేకెత్తించడం ద్వారా సాగు చేయడం జరుగుతుంది. ఇందుకోసం గత పంటలోని నాణ్యమైన పండ్లను ఇచ్చే మొక్కలను ఎన్నుకోవడం జరుగుతుంది.
 • ఈ ప్రక్రియని జులై మాసంలో మొదలుపెట్టడం జరుగుతుంది, సగటున 4.5x4.5 మీటర్ల వ్యత్యాసంతో ఈ మొక్కలను నాటుకోవాలని అనుభవజ్ఞులు సూచిస్తున్నారు.
 • ఇక ఉసిరి మొక్కలను భవిష్యత్తులోని రోగాల నుండి కాపాడటానికి తగిన రసాయనిక చర్యలను చేపట్టాలని రైతులు సలహా ఇస్తున్నారు.
నీటిపారుదల
 • సరైన నీటిపారుదల వ్యవస్థ అనేది ఈ పంటకు ఎంతో ముఖ్యం కాగా రెండు నుండి మూడు సంవత్సరాల వయసున్న మొక్కలకు తగిన నీరు పడితేనే మంచి దిగుబడి లభిస్తుంది.
 • ఇక వేసవిలో అయితే అయిదు రోజులకు ఒకసారి నీరు తప్పనిసరిగా పట్టాలి.
 • అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య కాలంలో ప్రతి మొక్కకు కనీసం 30 లీటర్ల నీరు అవసరం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
 • ఈ ప్రక్రియలో డ్రిప్ ఇరిగేషన్ పద్దతిని వాడితే అటు నీరు ఇటు ఎరువులను సక్రమంగా వినియోగించుకోవచ్చు.
సంరక్షణ
 • కలుపు మొక్కల నివారణతో పాటు ఉసిరి కొమ్మలను కత్తిరించడం కూడా లాభదాయకమైన దిగుబడికి ఎంతో అవసరం. ఇందుకోసం మొక్క పైభాగంలోని నాలుగు కొమ్మలను ఉంచి, కింది భాగంలోని కొమ్మలన్నీ తీసివేయడం జరుగుతుంది.
 • ఇక నేలను సిద్దం చేసే క్రమంలో 10 కిలోల సహజ ఎరువులను కలుపుకోవడంతో పాటు 100 గ్రాముల నత్రజని, 50 గ్రాముల ఫాస్పరస్ మరియు 100 గ్రాముల పోటాష్ మిశ్రమాన్ని నేలకు పట్టిస్తే మంచి దిగుబడి లభిస్తుంది.
 • ఉసిరి పంటను తీవ్రంగా ప్రభావితం చేసే పురుగు కాండం తొలిచే పురుగు, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది పంట దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
 • మరోవైపు సరైన పద్దతులు పాటించకపోతే రస్ట్ అనే వైరస్ కూడా ఈ పంట దిగుబడిపై ప్రభావం చూపి నష్టం కలిగించవచ్చు. ఇందుకోసం సరైన నిపుణులను సంప్రదించి తగిన నివారణ చర్యలను పాటించాలి.
పంటకోత మరియు దిగుబడి
 • ఉసిరి పంటను సరిగా సాగు చేయాలి కాని 60 నుండి 70 సంవత్సరాల వరకు దిగుబడిని ఇస్తుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
 • లేత ఆకుపచ్చ రంగు నుండి ముదురు పసుపు పచ్చ రంగులోకి కాయ మారడం పంట కోతకు వచ్చిందని తెలియజేస్తోంది.
 • ఉసిరి మొక్క సాధారణంగా 4 నుండి 5 సంవత్సరాల వయసు నుండే దిగుబడిని ఇస్తుంది. అయితే పూర్తి స్థాయిలో దిగుబడిని ఇవ్వాలంటే కనీసం 10 సంవత్సరాలు పడుతుందని రైతులు సూచిస్తున్నారు.
 • సగటున ఒక ఉసిరి చెట్టు 60 నుండి 75 కిలోల ఉసిరి పండ్లను ఇస్తుందని వ్యవసాయ నిపుణులు తెలియజేస్తున్నారు.
Continue Reading

మెంతుల సాగు

మెంతుల సాగు

ప్రపంచ వ్యాప్తంగా వార్షిక పంటగా సాగుచేసే మెంతులు లెగూమినోసే అనే చిక్కుడు జాతికి చెందినవి. వంటశాలలలో రోజువారి వినియోగించే ఆహార పదార్ధాలలో ఇవి కూడా ముఖ్యమైనవి కాగా అటు మూలిక గానూ ఇటు సువాసన పదార్ధం గానూ గొప్పగా వినియోగించబడుతోంది. దీని సాగు ఎంతో సులభం కాగా సరైన పద్దతిలో చేస్తే ఊహించని లాభాలను ఇస్తుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. దీని గింజలే కాకుండా మొక్కలను సైతం కూరలలో వినియోగిస్తారు, వీటికి కూడా మార్కెట్లో సమాంతర వ్యాపార విలువ ఉంది. మరి ఎక్కువ శాతం పొడి ప్రాంతాలలో పెరిగే ఈ మొక్కను ఏవిధంగా సాగు చేస్తారో చూద్దాం.

వాతావరణం మరియు నేల రకం
 • ఒక మోస్తరు వర్షపాతమే కావలసిన మెంతులకి ఎక్కువగా పొడి నేలలే సరిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు.
 • అంతేకాకుండా మంచు లేని చల్లని ప్రాంతాలు కూడా ఈ పంటకు అనుకూలమే.
 • ఇక ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు మెంతుల సాగుకి ఏమాత్రం పనికిరావని భావించాలి.
 • నేల విషయానికి వస్తే, కుళ్ళిన వ్యర్ధాలతో సారవంతంగా ఉండే నేల అధిక దిగుబడిని ఇస్తుంది.
 • అంతేకాకుండా ఉదజని విలువ 6 నుండి 7 మధ్య ఉండే నేల కూడా మెంతుల సాగుకు అనువైనది.
నేలను సిద్ధం చేయుట
 • వ్యవసాయ అనుభవజ్ఞుల ప్రకారం, మెంతుల సాగుకు అక్టోబర్ నుండి నవంబర్ మధ్య కాలం అనుకూలంగా ఉంటుంది. మొదటగా, గత పంట తాలూకు వ్యర్ధాలు కాని కలుపు మొక్కలు కాని లేకుండా మెత్తగా నేలను దున్నుకోవాలి.
 • చివరి క్రమంలో 20 నుండి 30 టన్నుల సహజ ఎరువులను నేలకు పట్టిచ్చి చదును చేసుకోవాలి, ఆ తరువాత తగిన విధంగా నీటి మడులను, గాళ్ళను సిద్ధం చేసుకోవాలి. సాధారణంగా వీటి కొలత 3.5 x 1.5m ఉంటుంది.
నాటుకునే ప్రక్రియ
 • మెంతుల పంటకు హెక్టారుకు 10 నుండి 12 కిలోల విత్తనాలు సరిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని నాటుకునే ముందు 1.5కిలోల అజోస్పిరిలం మరియు 50 గ్రాముల త్రికోదర్మా విరిడి కలగలిపిన మిశ్రమానికి పట్టించాలి. వీటివలన భవిష్యత్తులో రోగాల నుండి పంటను కాపాడవచ్చు.
 • తరువాత 20 x 15 cm వ్యత్యాసాన్ని పాటిస్తూ విత్తనాలను నాటుకున్న వెంటనే కలుపు సంహారకాలను తప్పకుండా చల్లుకోవాలి. దీనికి అనుభవజ్ఞుల సలహా తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది.
ఎరువుల మోతాదు
 • విత్తనాలను నాటుకున్న నెల తరువాత పంట పైనేలకు 20 కిలోగ్రాముల నత్రజనిని కలపాలని నిపుణులు చెబుతున్నారు.
 • తరువాత 20 నుండి 30 టన్నుల సహజ ఎరువును అడుగుభాగాన చల్లుకోవడంతో పాటు 30 కిలోల నత్రజని, 25 కిలోల ఫాస్పరస్ మరియు 40 కిలోల పోటాష్ మిశ్రమాన్ని నేలకు పట్టించాలి.
 • అయితే నత్రజని ఉపయోగం అనేది నేల రకాన్ని బట్టి ఉంటుంది. అందుకే ముందు నేల పరీక్ష తప్పనిసరి అని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
నీటిపారుదల వ్యవస్థ
 • విత్తనాలను నాటిన వెంటనే ఈ ప్రక్రియ మొదలవుతుంది.
 • ఇక విత్తనాలను నాటుకున్న రెండు రోజుల తరువాత రెండవ విడత నీరు పట్టాలి.
 • ఆ తరువాతి నుండి వారం వ్యవధిలో పంట మొత్తానికి నీరు పడుతుండాలి, అయితే ఎప్పుడూ నీరు ఎక్కువగా నిలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
పంటకోత
 • సాధారణంగా మెంతికూర ఆకులు అయితే నాటుకున్న నెలలోపే కోతకు వస్తాయి. ఇక విత్తనాలైతే మూడు నెలల వ్యవధిలో చేతికి వస్తాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
 • సగటున హెక్టారుకు 3000 నుండి 4500 కిలోల మెంతికూర ఉత్పత్తి చేయబడితే, 450 నుండి 750 కిలోల విత్తనాలు చేతికి అందుతాయి.
Continue Reading

ఉల్లి సాగు

ఉల్లి సాగు

దైనందిన జీవితంలో ఉపయోగపడే కూరగాయలలో ఉల్లి అత్యంత ప్రధానమైనది. ఈ ఉల్లి రెండు సంవత్సరాలకు పైగా మొలిచే మొక్కే అయినా ఎక్కువ శాతం దీనిని వార్షిక సాగుబడి కోసం వినియోగిస్తుంటారు. ప్రపంచ దిగుబడిలో భారతదేశం రెండవ దేశం కాగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాలు అందుకు తోడ్పడుతున్నాయి. వివిధ వాతావరణ పరిస్థితులలో సాగు చేసుకునే ఈ ఉల్లి 3 నుండి 5 నెలలలోపే కోతకు వస్తుంది. ఎరుపు, తెలుపు మరియు పసుపుపచ్చ రంగులో లభించే ఈ ఉల్లిసాగుకు ఎటువంటి పరిస్థితులు అనుకూలిస్తాయో ఒకసారి చూద్దాం.

వాతావరణం
 • ఉల్లిని భారతదేశంలో ఖరీఫ్ మరియు రబి పంటగా సాగు చేస్తారు. దీని సాగుకి వివిధ వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయి అయితే ఎక్కువ తేమ, వేడి మరియు వర్షపాతం ఉండకూడదు.
 • ఎక్కువ శాతం ఉష్ణ మరియు ఉపఉష్ణమండలాలతో పాటు 13 నుండి 25 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలు, వార్షిక వర్షపాతం 600 నుండి 800 మిల్లీమీటర్లు ఉండే ప్రాంతాలు మరియు 70% సాపేక్ష ఆర్ద్రత ఉండే ప్రాంతాలు ఈ పంటకు అనువుగా ఉంటాయి.
నేల
 • మంచి నీటిపారుదల వ్యవస్థ కలిగిన సారవంతమైన నేల ఈ పంటకు ఎంతో సహకరిస్తుంది. వీటితో పాటు సల్ఫర్ తక్కువగా ఉండి ఎక్కువ పోషణలతో కూడిన నేల ఉల్లి సాగుకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
 • అంతేకాకుండా ఉదజని విలువ 6.5 నుండి 8 వరకు ఉండి మంచి తేమతో కూడిన సారవంతమైన నేల కూడా ఉల్లి సాగుకు ఎంతో పనికొస్తుంది.
నేలను సిద్ధం చేయుట
 • సాధారణ రీతిలోనే నేలను బాగా దున్నుకున్న తరువాత చివరి క్రమంలో హెక్టారుకు 8 టన్నుల క్రిమి ఎరువును కాని 15 టన్నుల సేంద్రీయ ఎరువును కాని చల్లుకోవాలి.
 • ఆ తరువాత నేలను బట్టి 2 మీటర్ల వెడల్పు మరియు 5 మీటర్ల పొడవుతో చదునైన గాళ్ళను సిద్ధం చేసుకోవాలి. లేదంటే 20 సెంటీమీటర్ల ఎత్తుతో 115 సెంటీమీటర్ల పొడవుతో ఉండే వెడల్పాటి మడులను సిద్ధం చేయాలి. ఎక్కువగా వర్షాకాలంలో ఈ తరహా మడులు ఎక్కువ నీరు నిలువకుండా చేసి ఇతర రోగాల బారిన పడకుండా తోడ్పడతాయి.
మొలకల తయారీ
 • మొలకలను తయారు చేయడానికి ఉల్లి విత్తనాలను లేక ఉల్లి మొలకలను వినియోగించడం జరుగుతుంది. ఇందుకోసం ప్రత్యేక నర్సరీని నిర్వహిస్తూ సరైన నీటిపారుదలతో పాటు తగిన ఎరువులను జతచేసుకోవాలి.
 • వ్యవసాయ అనుభవజ్ఞుల ప్రకారం హెక్టారుకు సరిపోయే మొలకలను రేకెత్తించడానికి దాదాపు 7 కిలోల విత్తనాలు అవసరం పడతాయి.
 • ఒకటి నుండి రెండు నెలలలో ఈ విత్తనాలు మొలకెత్తి మార్పిడికి సిద్దంగా ఉంటాయి.
 • కేవలం విత్తనాలే కాకుండా గత పంటలోని నాణ్యమైన మరియు మంచి పరిస్థితులలో నిలువ ఉంచిన ఉల్లిగడ్డలను కూడా మొక్కలు నాటే ప్రక్రియకు వినియోగిస్తారు.
 • చివరగా ప్రతి వరుస క్రమానికి మధ్య కనీస వ్యత్యాసం 15 సెంటీమీటర్లు మరియు ప్రతి మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఉండేలా చూసుకుని మొలకలను నాటుకోవాలి.
నీటిపారుదల
 • మొలకలను నాటుకునే ముందు పొలం మొత్తానికి నీరు పట్టడం ఎంతో అవసరం. ఇక మొలకలను నాటుకున్న రెండు రోజుల తరువాత ఒక విడత నీరు పట్టాలి.
 • ఆ తరువాత నుండి వారం వ్యవధిని ఇస్తూ మొక్కలకు నీరు పడుతుండాలి. అయితే ఈ క్రమంలో ఎక్కువగా నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
 • ఇక చివరగా పంటకోత సమయం దగ్గరపడినప్పుడు 10 రోజుల ముందే నీరు పట్టడం నిలిపివేయాలి.
పంట సంరక్షణ
 • కలుపు మొక్కలు ఉల్లి పంటలో చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఉల్లి ఆకులతో సమానంగా ఉండడం చేత వీటి నివారణ అంత సులువుగా ఉండదు.
 • అయితే మంచి దిగుబడి కావాలంటే వీటి నిర్మూలన తప్పనిసరి. ఇందుకోసం వ్యక్తిగతంగా లేక రసాయనాల ద్వారా కాని వీటిని తొలగించవచ్చు.
 • ఇక రసం పీల్చే పురుగు, ఆకు తినే గొంగళి పురుగు మరియు ఉల్లి పురుగు పంటపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంటాయి. వీటికి బయిట ఎన్నో పురుగుల మందులు లభిస్తాయి, నిపుణులను సంప్రదించి తగిన నివారణ చర్యలను చేపట్టాలి.
 • అంతేకాకుండా ఆకు ముడత, వేరు తొలుచు రోగాలు దిగుబడిని చాలా తగ్గిస్తాయి. వీటిని నిపుణులు సూచించిన మార్గాలను అనుసరించి నివారించవచ్చు.
 • ఇక నేల సాంద్రతను కోల్పోకుండా ఎప్పటికప్పుడు పంట మార్పిడిని అవలంబిస్తే మంచి లాభాలు ఉంటాయి. ఇందుకోసం ఎక్కువగా సోయా పంటను రైతులు ఎన్నుకోవడం సాధారణం.
పంటకోత
 • ఉల్లి మొక్క కొత్త ఆకులను చిగురించకుండా ఆపివేయడం పంటకోతకు సంకేతంగా భావించాలి.
 • ఇక పంటకోత చేపట్టబోయే పది రోజుల ముందు నీటిపారుదలను నిలిపివేయాలి.
 • అయితే పంటకోత అనేది ఎంచుకున్న రకాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటుదనేది మరువరాదు.
 • నేల నుండి ఉల్లిని బయిటికి తీసిన తరువాత రెండు నుండి మూడు రోజుల పాటు వాటికి సూర్య రష్మి తగిలేలా చూడాలి, దీనివలన ఉల్లిలో ఉండే అధిక నీరు తొలగింపబడుతుంది.
Continue Reading

ద్రాక్షపండ్ల సాగు

ద్రాక్షపండ్ల సాగు

అత్యధిక లాభాలు తీసుకొచ్చే వాణిజ్య పంటలలో ద్రాక్ష సాగు ఎప్పటికీ మొదటి వరుసలో ఉంటుందని చెప్పొచ్చు. విటస్ అనే పువ్వు జాతికి చెందిన ఈ ద్రాక్షను వివిధ వాతావరణ పరిస్థితులలో సాగు చేసుకోవచ్చు. దాదాపు ఎనిమిది వేల సంవత్సరాల క్రితం దీని సాగుబడి పశ్చిమ ఆసియాలో మొదలవగా ఎక్కువ శాతం మధువును తయారు చేయడానికి వీటిని వినియోగించేవారు. తరువాత దీని మత్తెక్కించే తీయదనం ఈ పండుకు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప గుర్తింపును తీసుకొచ్చింది. భారతదేశంలో అయితే దీనిని మధువును తయారీ చేయడంలో కంటే తాజాగా తినడానికే ఇష్టపడతారు. ఈక్రమంలోనే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు వంటి రాష్ట్రాలు ద్రాక్షను అధిక శాతం సాగు చేస్తున్నాయి. మరి ఇటువంటి లాభదాయకమైన పండును ఎటువంటి పరిస్థితులలో సాగు చేస్తారో ఒకసారి పరికించి చూద్దాం.

వాతావరణ పరిస్థితులు
 • వ్యవసాయ అనుభవజ్ఞుల ప్రకారం మధ్యస్తంగా ఉండే వాతావరణ పరిస్థితులు దీని సాగుకు అనుకూలంగా ఉంటాయి. సాధారణంగా ద్రాక్ష తీగలు వేడిమి మరియు పొడిగా ఉండే ప్రాంతాలలో బలంగా పెరుగుతాయి.
 • దిగుబడి నాణ్యతతో పాటు అధికంగా ఉండాలంటే ఉష్ణోగ్రత 10 నుండి 40 డిగ్రీ సెంటిగ్రేడ్లు ఉండాలంటున్నారు నిపుణులు.
 • తేమ ఉండే ప్రాంతాలు వీటి సాగుకు అస్సలు సరిపోవు, ఎందుకంటే అధిక తేమ వలన ఎక్కువగా ఈ పంట వివిధ ఫంగస్ బారిన పడి నష్టపరిచే అవకాశాలు ఉంటాయి.
నేల రకం
 • ద్రాక్ష సాగుకి చాలా రకాల నేల అనువుగా ఉంటాయి, అయితే ఉదజని విలువ 6 నుండి 8 మధ్య ఉండే సారవంతమైన నేల మంచి దిగుబడిని ఇస్తుంది.
 • అంతేకాకుండా నీటి నిలువ లేకుండా సహజమైన కుళ్ళిన ఎరువులతో సమృద్ధిగా ఉండే బంకమట్టి నేల కూడా వీటి సాగుకు అనువుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
రకాలు మరియు మొలకల వ్యాప్తి
 • పండు ద్రాక్ష, ఎండు ద్రాక్ష మరియు మధువు ద్రాక్ష కోసం మార్కెట్లో వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయ నిపుణులను సంప్రదించి సాగు చేసుకునే పంటను బట్టి రకాన్ని ఎంచుకోవాలి.
 • ద్రాక్ష పంటను అంటుకట్టడం ద్వారా సాగు చేసుకోవచ్చు లేదా వేర్లు ఉన్న చెట్లనే నేరుగా నాటుకోవచ్చు, అంతేకాకుండా వేర్లు లేని తీగలను సైతం నాటుకుని సాగు చేసుకోవచ్చని అనుభవజ్ఞుల సూచన.
సరైన కాలం
 • భారతదేశంలో వేరుకాండం ద్వారా వ్యాప్తి చెందిన పంటను ఎక్కువ శాతం ఫిబ్రవరి నుండి మార్చ్ మధ్య కాలంలో సాగు చేస్తారు. అయితే సెప్టెంబర్ మరియు అక్టోబర్ మధ్య కాలంలో ద్రాక్ష సాగును చేపట్టడం సర్వసాధారణం.
 • ఇక కొంతమంది అయితే జూన్-జులై మధ్య కాలంలో దీనిని సాగు చేయడం పరిపాటి, కాని ఎక్కువ రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఈ కాలంలో ద్రాక్ష సాగు చేపట్టకపోవడమే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
నేలను సిద్ధం చేయడం
 • నేలను మంచిగా చదును చేసుకున్న తరువాత 110 X 160 మీటర్ల కొలమానంలో గుట్ట మడులను సిద్దం చేసుకోవాలి, వీటి మధ్య 2 నుండి 3 మీటర్ల వ్యత్యాసంతో రోడ్డు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
 • తరువాత ప్రతి మొక్కకు సమపాళ్లలో నీరు చేర్చేందుకు డ్రిప్ ఇరిగేషన్ పద్దతికి అనుకూలంగా గుట్ట మడులను చదును చేసుకోవాలి.
 • తీగలు, సన్నని చెక్కల సహాయంతో మడులపై ద్రాక్ష తీగలు పెరగడానికి అనువుగా కంచెలను నిర్మించుకోవాలి. దీని వలన రోగాలను నివారించడమే కాకుండా దిగుబడిని పెంచుకునే వీలుంటుంది.
 • ఇక తీగలను నాటుకోవడానికి ఒక అడుగు లోతు మరియు ఒక అడుగు వెడల్పు ఉండే విధంగా గుంతలను తవ్వుకోవాలి. తరువాత ఈ గుంతలలో మెత్తని మట్టితో పాటు కావలసిన ఎరువులను కలిపి పెట్టుకోవాలి.
నీటిపారుదల
 • ద్రాక్షకు సకాలంలో నీరు అందించడం అవసరం, వేసవిలో అయితే వారానికి ఒకసారి, వర్షాకాలంలో మూడు వారాలకు ఒకసారి, శీతాకాలంలో అయితే పది రోజులకు ఒకసారి నీరు తప్పనిసరిగా ఇస్తుండాలి.
 • అదే డ్రిప్ పద్దతి ద్వారా అయితే వేసవిలో ఒక చెట్టుకు 50 లీటర్ల నీరు అవసరం పడుతుంది, ఇక వర్షాకాలంలో 30 లీటర్ల నీరు, శీతాకాలంలో 40 లీటర్ల నీరు ప్రతి మొక్కకు అవసరం.
మొక్కల సంరక్షణ
 • మొక్క లాభసాటిగా ఎదగడానికి కత్తెరింపు అనేది ఎంతో ముఖ్యమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వారి మాటల ప్రకారం మొక్క ఎదిగే సమయంలో ఎంత ఎక్కువ కత్తిరిస్తే అంత ఎక్కువగా దిగుబడి సామర్ధ్యం పెరుగుతుందట.
 • అంతేకాకుండా సేంద్రియ ఎరువులతో పాటు, రసాయనిక మరియు జీవ ఎరువులను సంవత్సరానికి ఒకసారి పంటకు పట్టించడం వలన ఎక్కువ దిగుబడి కలిగిన ఆరోగ్య పంట లభిస్తుంది.
 • ఈ పంటపై చాలా రకాల ఫంగస్ మరియు బాక్టీరియా రోగాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. బయిట మార్కెట్లో వీటికి ఎన్నో నివారణ చర్యలు ఉండగా నిపుణులను సంప్రదించి పంటకు సరిపోయే నివారణ చర్యలను చేపట్టాలి.
 • వీటితో పాటు ద్రాక్ష గుత్తులను అధిక సూర్య రష్మి నుండి, అధిక వర్షాల నుండి మరియు శీతాకాల మంచు నుండి కాపాడటానికి ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు చేపట్టాలి.
పంటకోత
 • సరైన పద్దతిలో సాగు చేయాలి కాని ద్రాక్ష దాదాపు 30 ఏళ్లపాటు కోతను ఇస్తుందని కొంతమంది నిపుణులు చెబుతుంటారు. సాధారణంగా ఈ పంట కోతను ఫిబ్రవరి మాసంలో మొదలుపెట్టి ఏప్రిల్ చివరి వరకు కూడా కొనసాగిస్తారు.
 • సగటున హెక్టారుకు విత్తనాలు లేని రకం అయితే 25 నుండి 35 టన్నుల ద్రాక్షను దిగుబడి చేయవచ్చు, అదే విత్తనాలున్న రకం అయితే 55 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
Continue Reading

వర్టికల్ ఫార్మింగ్

వర్టికల్ ఫార్మింగ్

గణనీయంగా పెరుగుతున్న జనాభా మరియు ఆహార కొరత వలన వ్యవసాయ రంగంలో అధునాతన పద్దతులు చోటు చేసుకుంటున్నాయి. సాంప్రదాయ వ్యవసాయాన్ని విస్తరించేందుకు కనుగొన్న అటువంటి ఒక పద్దతే వర్టికల్ ఫార్మింగ్. వర్టికల్ ఫార్మింగ్ అంటే తక్కువ నీరు మరియు నేలను వినియోగిస్తూ, నిలువుగా అమర్చిన పొరలలో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా పంటలను పండించడమే. ఇప్పటికే కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ఈ విధానం బాగా ప్రాచుర్యం పొందగా భారతదేశంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. మరి అటువంటి సాంకేతిక పరిజ్ఞానం గురించిన సమాచారాన్ని ఒకసారి చూద్దాం.

చరిత్ర
 • పైకప్పు ప్రదేశంలో వ్యవసాయం చేయడమనేది ప్రాచీన కాలం నుండి ఉన్న ఆలోచనే అయినా దీనిని పూర్తి స్థాయిలో అమలుపరచే విధంగా కార్యరూపాన్ని ఇచ్చింది మటుకు పర్యావరణ ఆరోగ్య మరియు జీవశాస్త్ర అధ్యాపకుడు డిక్సన్ డిస్పోమ్మెర్ అనే చెప్పాలి.
పనితీరు
 • ప్రస్తుతం వర్టికల్ ఫార్మింగ్ పద్దతిని చిన్న పంటలైన పాలకూర, బ్రొకోలి మరియు టమాటా వంటి పంటలకు మాత్రమే అవలంబిస్తున్నారు.
 • ఈ తరహా పద్దతిని గిడ్డంగి లేదా పెద్ద బంగాళాలలో పంట మొత్తానికి గాలి, వెలుతురు మరియు పోషణలు సమానంగా అందేలా నిర్వహిస్తుంటారు.
 • ప్రాచీన పద్దతిలో అయితే సూర్య రష్మీ ద్వారా మొక్కలకు శక్తి లభిస్తుంది, ఈ తరహా పద్దతిలో ఎల్.ఈ.డి బల్బుల ద్వారా పంట మొత్తానికి కావలసిన శక్తిని సమకూరుస్తారు.
 • అన్ని అమర్చిన పొరలకు కూడా నీటిపారుదల గురించి మరియు పోషణల లభ్యత గురించి ప్రత్యేక పర్యవేక్షణ సదుపాయాన్ని అమర్చుతారు.
 • అంతేకాకుండా వీటిలో అమర్చే ప్రత్యేక సెన్సార్లు మొక్కలకు అవసరమైన పోషణల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ వివిధ రోగాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందజేస్తాయి.
లాభాలు
 • ఈ పద్దతి యొక్క ముఖ్య ఉద్దేశ్యం తక్కువ నేల మరియు నీరును వినియోగిస్తూ ఎక్కువ దిగుబడిని సాధించడం.
 • ఈ తరహా సాగులో నేల వినియోగం చాలా తక్కువ కనుక సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. అంతేకాకుండా ప్రాచీన పద్దతిలో లాగా ఏ విధమైన పురుగుల మందుల అవసరం పడదు.
 • మూసిన ప్రదేశాలలో చేసే సాగు కనుక, ఎక్కువ మనుషులు మరియు యంత్రాల బెడద తప్పడమే కాక వాతావరణ పరమైన ఆంక్షలు ఉండవు.
 • ప్రాచీన పద్దతులతో పోలిస్తే ఈ తరహా సాగులో అత్యధిక దిగుబడిని సాధించవచ్చు.
 • అంతేకాకుండా తక్కువ సమయంలో మేటి దిగుబడిని ఇవ్వడం ఈ తరహా సాగులో ప్రధాన లాభమని చెప్పొచ్చు.
 • సాంప్రదాయ వ్యవసాయంలో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు దిగుబడిపై ప్రాభవం చూపే అవకాశం ఉంది. అదే ఈ తరహా సాగులో అయితే ఎటువంటి ప్రకృతి పరమైన ఇబ్బందులు ఉండవు, ఒక్క భూకంపం వస్తే తప్ప.
ప్రతికూలాంశాలు
 • పంట పూర్తయిన తరువాత అనూహ్య లాభాలు తెచ్చినప్పటికీ ఈ తరహా సాగుబడికి ఎంతో ఖర్చు అవసరం పడుతుంది. చిన్న, మధ్యకారు రైతులు దీనిని భరించడం కష్టమనే చెప్పాలి.
 • వర్టికల్ ఫార్మింగ్ అనేది చిన్న తరహా పంటలకు మాత్రమే ఉపయోగపడుతుంది. మొక్కజొన్న, చెరకు వంటి పంటల సాగుకు ఈ పద్దతి ఇంకా పురోగమించవలసి ఉంది.
 • ఇక విత్తనాల నుండి మొలకలను రేకెత్తించడానికి మరొక ప్రత్యేక నివాస సముదాయాన్ని ఏర్పరుచుకోవడమనేది అధిక ఖర్చుతో కూడుకున్నది.
 • మరో ప్రతికూలాంశం ఎల్.ఈ.డి బల్బుల వాడకం. ఈ తరహా సాగులో మొక్కలకు కావలసిన సౌర శక్తిని ఈ బల్బుల ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. దీని వలన విద్యుత్తు చార్జీలు పెరగవచ్చు.
 • సాంప్రదాయ వ్యవసాయం ప్రాకృతిక పరిస్థితులపై ఆధారపడి ఉంటే వర్టికల్ ఫార్మింగ్ సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. కనుక ఏ వ్యవస్థలోనైనా లోపం ఏర్పడితే మొక్కలు తీవ్ర ప్రభావానికి లోనవడం ఖాయం.
లభ్యత
 • ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో వర్టికల్ ఫార్మింగ్ ఇంకా అభివృద్ధిలోకి రాలేదనే చెప్పాలి.
 • ఈ తరహా సాగులో హైడ్రోపోనిక్స్, ఏరోపోనిక్స్ మరియు ఆక్వాపోనిక్స్ అనే పద్దతులను అవలంభిస్తారు. ప్రతి ఒక్కటి దేనికదే భిన్నమైంది కనుక దేని ఖరీదు దానిదే అని చెప్పాలి.
 • వెంటిలేషన్ స్టేషన్, మొలకల తయారీ నివాసం, వాతావరణ నియంత్రణ వ్యవస్థ మరియు ఎల్.ఈ.డి బల్బలతో కలిపి ఒక చిన్న తరహా పంట సాగు కోసం నిర్మించే బంగళాలో వంద పొరలను అమర్చడానికి సగటున 13 నుండి 15 లక్షల రూపాయలు అవసరం పడుతుంది.
Continue Reading